ఫ్రాన్స్‌లో అబయ డ్రెస్‌పై నిషేధం: విద్యాశాఖ మంత్రి ప్రకటన

పౌర హక్కుల ఉల్లంఘనేనంటూ విమర్శలు

France to soon ban wearing of abayas by Muslim women in schools

ఫ్రాన్స్: స్కూళ్లలో అబయ డ్రెస్‌ను నిషేధించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లిం అమ్మాయిలు ధరించే ఈ డ్రెస్ దేశ లౌకిక చట్టాలను ఉల్లంఘించేదిగా ఉందని విద్యాశాఖమంత్రి గాబ్రియెల్ అటల్ పేర్కొన్నారు. ఇకపై స్కూళ్లలో అబయను ధరించడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబరు 4 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఫ్రాన్స్ స్కూళ్లలో ఇస్లామిక్ హెడ్‌స్క్రాఫ్‌ ధరించడంపై ఎప్పటి నుంచే నిషేధం ఉంది. ఇప్పుడు అబయ డ్రెస్‌ను కూడా నిషేధించనుంది.

ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అబయ డ్రెస్ ధరించకుండా నిషేధించడమంటే పౌర హక్కులను ఉల్లంఘించడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, మంత్రి మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సెక్యులరిజం అంటే పాఠశాల ద్వారా విముక్తి పొందే స్వేచ్చ అని పేర్కొన్నారు. అంతేకానీ, తరగతి గదిలోని విద్యార్థులను చూసి వారి మతాన్ని గుర్తించడం కాదని తేల్చి చెప్పారు. కాగా, అబయ డ్రెస్ అనేది శరీరాన్ని కాలి వేళ్ల వరకు కనిపించకుండా ధరించే డ్రెస్.

విద్యార్థులు తమ మతాన్ని ప్రదర్శించేలా ఎలాంటి దుస్తులు ధరించకుండా మార్చి 2004లోనే ప్రభుత్వం నిషేధించింది. ఇందులో శిలువలు, యుదు కిప్పాస్‌లు, ఇస్లామిక్ హెడ్‌స్కార్ఫ్‌లు ఉన్నాయి. దీంతో ముస్లిం అమ్మాయిలు ఇస్లామిక్ హెడ్‌స్కార్ఫ్‌లకు బదులుగా పొడవైన బ్యాగీ వస్త్రం (అబయ)ను ధరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దానిని కూడా నిషేధించనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది.