మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేశుబ్ మహీంద్రా కన్నుమూత

5 దశాబ్దాల పాటు సంస్థను నడిపించిన కేశుబ్

Former Mahindra Group Chairman Keshub Mahindra dies at 99

ముంబయిః ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేశుబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. ఈ రోజు తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఎంఅండ్ఎం మాజీ ఎండీ పవన్ గోయెంకా ట్విట్టర్ లో వెల్లడించారు. కేశుబ్ మరణంపై కంపెనీ అధికార ప్రతినిధి కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూపునకు చైర్మన్ గా కేశుబ్ వ్యవహరించారు. సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, ఐసీఐసీఐ లాంటి ప్రముఖ కంపెనీ బోర్డుల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గానూ గతంలో పని చేశారు. పలు ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా వ్యవహరించారు.

అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో కేశుబ్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1947లో మహీంద్రా గ్రూప్‌లో చేరిన కేశుబ్‌.. 1963లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు కంపెనీకి నాయకత్వం వహించారు. సంస్థను అనేక రంగాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. కేశుబ్ వ్యాపారంలోకి ప్రవేశించిన నాటికి కంపెనీ ప్రధానంగా విల్లీస్ జీపులను తయారు చేస్తుండేది. ఇప్పుడు మహీంద్రా గ్రూప్ వాహనం, ఇంధనం, సాఫ్ట్ వేర్ సేవలు, స్థిరాస్తి, ఆతిథ్యం, రక్షణ వంటి రంగాలకు విస్తరించింది. 2012 ఆగస్టులో చైర్మన్‌గా ఆయన పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ లిస్ట్ 2023లో కేశుబ్‌ మహీంద్రా చోటు దక్కించుకోవడం గమనార్హం. భారతదేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఆయన నిలిచారు.