మధ్య తరగతి వారి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానంః నిర్మలా సీతారామన్‌

Finance Minister Nirmala Sitharaman presents Interim Budget 2024

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ప్రసంగిస్తున్నారు.

మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని వెల్లడించారు. మధ్య తరగతి కోసం కోసం కొత్తగా గృహనిర్మాణం విధానం తీసుకురాబోతున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్‌ యోజన ఇండ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చామన్నారు. కొవిడ్ కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అమలు కొనసాగించామన్నారు.

3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉన్నామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో మరో 2 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ ప్రసంగం వినిపిస్తూ.. జీడీపీకి ప్రభుత్వం కొత్త అర్థం చెప్పిందన్న ఆర్థిక మంత్రి.. జీడీపీ అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌ పెర్ఫార్మెన్స్‌ అని కొత్త అర్థం ఇచ్చామన్నారు. పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామన్నారు. పదేళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50శాతానికిపైగా పెరిగిందన్నారు. వాసవ్త ఆదాయ పెరుగుదల ప్రజల జీవన ప్రమాణాలు పెంచిందన్నారు. ఆశాలు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు.

భార‌త్‌ను 2047 నాటికి విక‌సిత భార‌త్‌గా తీర్చిదిద్దేందుకు త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని ఆమె అన్నారు. మోడీ స‌ర్కార్‌కు చెందిన చివ‌రి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆమె మాట్లాడుతూ.. దేశ ప్ర‌జ‌ల స‌గ‌టు ఆదాయం 50 శాతం పెరిగిన‌ట్లు తెలిపారు. గ‌డిచిన ప‌దేళ్ల‌లో మ‌హిళ‌ల సాధికార‌త పెరిగింద‌న్నారు. ట్రిపుల్ త‌లాక్‌ను చ‌ట్ట‌రీత్యా నేరం చేశామ‌న్నారు. ప్ర‌భుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మ‌హిళ‌ల‌కు ఇండ్లు అంద‌జేసిన‌ట్లు చెప్పారు. అన్ని ర‌కాల మౌళిక‌స‌దుపాయాల్ని రికార్డు స‌మ‌యంలో క్రియేట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాలు భాగ‌స్వామ్యం అవుతున్నాయ‌న్నారు. వ‌న్ నేష‌న్ వ‌న్ మార్కెట్ వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణం అదుపులో ఉంద‌న్నారు. ఉన్న‌త విద్యాభ్యాసం కోసం మ‌హిళ‌ల సంఖ్య పెరిగింద‌న్నారు. 25 కోట్ల మంది పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు.