అమ‌ర్‌నాథ్ దేవాల‌యం వద్ద ఆకస్మిక వరదలు..5 మంది మృతి

అమ‌ర్‌నాథ్ దేవాల‌యం వద్ద ఒక్కసారిగా వరదలు బీబత్సం సృష్టించాయి. స్వల్ప వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా గుహ వద్ద భారీ వరద ముంచెత్తింది. సాయంత్రం అయిదున్నర గంటల ప్రాంతంలో ఊహించని రీతిలో కొండలపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద నీరు దూసుకువచ్చింది. దీంతో యాత్రికులు పరుగులు పెట్టారు. అనేక టెంట్లు కొట్టుకుపోయాయి. ఊహించని పరిణామానికి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వరదల తాకిడికి ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది.

అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆకస్మిక వరద సమాచారం అందుకున్న ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ సహా ఇతర సంస్థలు కలిసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. గుహ ప‌రిస‌రాల్లో 12 వేల మంది యాత్రికులు ఉన్నార‌ని తెలుస్తున్న‌ది. అక‌స్మాత్తుగా వ‌ర‌ద రావ‌డంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలా మంది కనిపించకుండా పోవడంతో వరదలో కొట్టుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రాణ నష్టం వివరాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విపత్తు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు. 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక గ‌త నెల 30న అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రారంభ‌మైంది.