ప్రజ్వల్‌ రేవణ్ణకు షాకిచ్చిన బెంగళూర్ కోర్టు

Bengaluru court shocked Prajwal Revanna

న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు బెంగళూరు సెషన్స్‌ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మే 31వ తేదీన ప్రజ్వల్‌ రేవణ్ణ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు.

ప్రజా ప్రతినిధుల కోర్టు ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ చేయడంతో సిట్‌ అధికారులు ప్రజ్వల్‌ను అరెస్టు చేసి అతని వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారని వెల్లడించారు. మే 18న సిట్‌ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశే ఎదురైంది.

మరోవైపు మహిళ కిడ్నాప్‌కు సంబంధించిన కేసులో ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని హెచ్డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ కూడా ప్రజా ప్రతిధుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం తీర్పును మే 31కు రిజర్వ్‌ చేసింది. అటు హెచ్‌డీ రేవణ్ణకు మంజూరు చేసిన ముందుస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సిట్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేసింది.