నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా.. తెలంగాణలో 8 ఎంపీ స్థానాలకు ప్రకటన!

bjp

హైదరాబాద్‌ః పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కూడా విజయకేతనం ఎగురవేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని బిజెపి ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము నాలుగింటి వరకు ఈ కమిటీ చర్చలు జరిపింది.

ఈ నేపథ్యంలో ఈరోజు ఏ క్షణమైనా తొలి జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా 100 మంది పేర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. చాలామంది సిటింగ్‌ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో యూపీ, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కేరళ, తెలంగాణలోని స్థానాలపై దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాల సమాచారం. తెలంగాణలో తొలి విడతలో ఎనిమిది ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.