శివపార్వతి థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం

రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం!


హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్‌లో గత అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు థియేటర్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. హాలులోని స్క్రీన్, కుర్చీలు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో పైకప్పు కూలిపోయింది.

అయితే, ఆ సమయంలో థియేటర్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే థియేటర్ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు.

ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివపార్వతి థియేటర్‌లో ప్రస్తుతం శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా నడుస్తోంది. ప్రమాదంలో దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/