కాలి బూడిదైన కూకట్ పల్లి శివపార్వతి థియేటర్

హైదరాబాద్ కూకట్ పల్లి లోని శివపార్వతి థియేటర్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో థియేటర్ మొత్తం బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిపమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో థియేటర్‎లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది.

ఆదివారం రాత్రి థియేటర్ లో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా సెకండ్ షో ముగిన తర్వాత చాలా సేపటికి ఈ ఘటన జరిగింది. శివపార్వతి థియేటర్ పూర్తిగా తగలబడిపోయిందనే వార్త సినీ అభిమానులను కలవరపెడుతోంది. థియేటర్ కాలిపోతోన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అదృష్టవశాత్తూ అగ్నిప్రమాదం జరిగినప్పుడు థియేటర్ సిబ్బంది కూడా అక్కడ లేకపోవడంతో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. అయితే, ఆస్తి నష్టం రూ.2కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.