ఆగస్టు 1 నుండి సినిమా షూటింగ్ బంద్

అంత అనుకున్నట్లే అయ్యింది. ఆగస్టు 01 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా, తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. అయితే, అనూహ్యంగా నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఓటీటీ, వీఎఫ్ఎక్స్ చార్జీలు, సినిమా టికెట్ ధ‌ర‌ల వంటి ప‌లు అంశాల‌పై చ‌ర్చించి ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారీ సినిమాల‌ను థియేట‌ర్‌లో విడుద‌లైన 10 వారాల త‌ర్వాతే ఓటీటీకి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాల‌ను 4 వారాల త‌ర్వాత ఓటీటీకి ఇవ్వొచ్చ‌ని పేర్కొంది. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు వీఎఫ్ఎక్స్ చార్జీలను ఎగ్జిబిట‌ర్లే చెల్లించాల‌ని తీర్మానించింది.

అలాగే సినిమా టికెట్‌ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతిపాదించింది. నగరాలు, పట్టణాల్లో సాధారణ థియేటర్లు, సి-క్లాస్‌ సెంటర్లలో టికెట్‌ ధరలు రూ.100, రూ.70(జీఎస్టీతో కలిపి)గా ఉంచాలని ప్రతిపాదించారు. ఇక మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125 ఉండేలా ప్రతిపాదనలు చేశారు. మీడియం బడ్జెట్‌, మీడియం హీరో సినిమాలకు టికెట్‌ ధర నగరాలు/పట్టణాల్లో రూ.100 ప్లస్‌ జీఎస్టీ ఉండాలని, అదే సి-సెంటర్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉండాలని, మల్టీప్లెక్స్‌లో అత్యధికంగా రూ.150 ప్లస్‌ జీఎస్టీతో మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు.