మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను అంతరిక్షంలోకి పంపిస్తాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

అక్టోబర్‌‌లో గగన్‌యాన్ ప్రయోగం చేపడతామన్న జితేంద్ర సింగ్

Female Robot ‘Vyommitra’ Will Go To Space..Science Minister On Gaganyaan

న్యూఢిల్లీః కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘గగన్‌యాన్‌’ మిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను పంపనున్నట్లు వెల్లడించారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన జీ20 కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో జరుగుతాయని తెలిపారు.

‘‘కరోనా మహమ్మారి వల్ల గగన్‌యాన్ కార్యక్రమం ఆలస్యమైంది. తొలి ట్రయల్ మిషన్‌ను అక్టోబర్‌‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. వ్యోమగాములను పంపించడం ఎంత ముఖ్యమో, వారిని తిరిగి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం” అని వివరించారు. రెండో మిషన్‌లో మహిళా రోబోను పంపుతామని వెల్లడించారు. ఆమె అన్ని మానవ కార్యకలాపాలను నిర్వహిస్తుందని చెప్పారు. అంతా సవ్యంగా ఉంటే ఇక వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చని ఆయన తెలిపారు. భూమి పైనుంచి 400 మీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి గగన్‌యాన్‌ మిషన్‌ ద్వారా వ్యోమగాములను తీసుకెళ్లనున్నారని చెప్పారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3 విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టడంతో తాము ఊరట పొందామని జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రయోగ సమయంలో ఇస్రో టీమ్‌తో ఉన్న వారందరం చాలా ఉధ్విగ్నంగా ఉన్నామని చెప్పారు. చంద్రయాన్–3 విజయవంతం కావడంతో ఇస్రో, ఇండియా.. అంతరిక్ష రంగంలో గొప్ప ముందడుగు వేశాయని అన్నారు.