పోలీసులతో ఈటెల వాగ్వాదం ..

శాసనసభ సమావేశాల నుంచి ఈటల రాజేందర్‌ ను స్పీకర్ సస్పెండ్‌ చేయడం జరిగింది. సస్పెన్సన్‌ అనంతరం.. ఈటల రాజేందర్‌ ను బలవంతంగా పోలీసులు వాహనంలో ఎక్కించి అసెంబ్లీ నుండి తీసుకొని పోయారు. ఈ క్రమంలో పోలీసులతో ఈటెల వాగ్వాదానికి దిగారు.

తన వాహనంలో వెళ్తున్న ఈటలను పోలీసులు ఆదుకోవడం తో ఈటెల వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తనను అరెస్ట్‌ చేస్తున్నారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. బానిసలా వ్యవహరించవద్దు అంటూ పోలీసులపై నిప్పులు చెరిగారు. మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తూ.. గొంతు నొక్కుతున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను అని ఈటల రాజేందర్‌ సవాల్ విసిరారు.

అంతకు ముందు స్పీకర్ ని మర మనిషి అన్నందుకు క్షమాపణలు చెప్పి.. సభలో కొనసాగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే దీనికి ఈటల నిరాకరించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. దీంతో ఈటల సభను వీడాలని స్పీకర్ వెల్లడించారు.

అసెంబ్లీ ప్రారంభమవ్వగానే ఈటల స్పీకర్ ను ఉద్దేశించి చేసిన మరమనిషి అన్న కామెంట్స్ పై సభలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లేవనెత్తారు. ఈటల క్షమాపణలు చెప్పాలని సూచించారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతుంటే.. ‘మాటలు ఏమి లేవు, బయటికి పంపాలి’ అంటూ బాల్కసుమన్ కామెంట్ చేశారు. స్పీకర్ పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సీనియర్ అయినా స్పీకర్ పై అమర్యాదగా మాట్లాడారని మంత్రి వేముల అన్నారు. ఈటెల రాజేందర్ సభలో ఉండాలని కోరుకుంటున్నాం.. కానీ క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొనాలని సూచించారు. దీనికి ఈటల నిరాకరించడంతో సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.