హుజురాబాద్‌‌లో ఈటలకు ఘోర పరాభవం : ‘నాశనమైపోతవ్.. మట్టి కొట్టుకుపోతవ్’.. అంటూ ఓ తల్లి శాపనార్థాలు

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఆయనపై ఓ కుటుంబం శాపనార్థాలు పెట్టింది. తమ కొడుకును పొట్టన పెట్టుకున్నావంటూ ఓ తల్లి శాపనార్థాలు పెట్టింది.

పాపయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌ యాదవ్‌ హుజూరాబాద్‌ ప్రభుత్వ హాస్పటల్ లో కేసీఆర్‌ కిట్‌ విభాగంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసేవాడు. ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాడనే కోపంతో అతనిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఉద్యోగం కోసం ఈటలను కలిసి బ్రతిమాలినా ఉద్యోగం తిరిగి రాలేదు. దీంతో ప్రవీణ్ మానసికంగా కుంగిపోయి ఆరోగ్యం క్షీణించి గుండెపోటుతో మృతి చెందాడు. తన కొడుకు చావుకు ఈటల రాజేందరే కారణమని ప్రవీణ్ తల్లిదండ్రులు అప్పట్లోనే ఆరోపించారు. ఈ క్రమంలో ఈటెల మంగళవారం పాపయ్యపల్లి గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు.

ఈ క్రమంలో ప్రవీణ్ యాదవ్ తల్లిదండ్రులు విజయ, మల్లయ్య ఆయన్ని అడ్డుకున్నారు. మా కొడుకు చావుకు నువ్వే కారణమంటూ మండిపడ్డారు. ‘ఏ మొహం పెట్టుకుని మా ఊరికి వచ్చినవ్‌. మా ఉసురు నీకు తగులుద్ది. నువ్వు నాశనం అయిపోతవ్‌. మట్టి కొట్టుక పోతవ్‌’ అంటూ దుమ్మెత్తిపోశారు. వాళ్లను తప్పించుకొని కారు ఎక్కేందుకు రాజేందర్‌ ప్రయత్నించగా వెంటపడి శాపనార్థాలు పెట్టారు. గ్రామస్తులు కల్పించుకుని వారిని శాంతింపజేశారు. ఈ ఘటనతో షాకైన ఈటల రాజేందర్ ఏం మాట్లాడకుండా కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.