భద్రకాళి మినీ ట్యాంక్​ బండ్ ను ప్రారంభించిన ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ అర్బన్ కేంద్రంలోని భద్రకాళి చెరువుపై నగర ప్రజల ఆహ్లాదం కోసం చేపట్టిన మినీ ట్యాంక్ బండ్​ను శుక్రవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్‌ తో కలిసి ప్రారంభించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు. 570 మీటర్ల పొడవైన భద్రకాళి మినీబండ్ ను రూ.2కోట్ల 10 లక్షలతో నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..వరంగల్ అంటేనే భద్రకాళి గుడి..భద్రకాళి గుడి అంటేనే వరంగల్ అనే అభిప్రాయం ఉంటుందని, అలాంటి భద్రకాళి గుడికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీయార్ దేనని కొనియాడారు. దేశ, విదేశాలనుంచి వచ్చే భక్తులు, పర్యాటకులను సైతం ఆకట్టుకునేలా భద్రకాళి బండ్ ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ట్యాంక్ బండ్ అందాలను చూసి ఆనందం కలిగిందని , నగర వాసులకు ఇది మంచి ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో ఇది ఉందని అన్నారు. ఈ ట్యాంక్ బండ్ జిల్లా ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి వీక్షించేందుకు అనువుగా ఉందని చెప్పారు.