బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు

ED Seeks 5 More Days Of K Kavitha’s Remand, BRS Leader Files Bail Plea

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో కవితను అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు, మరో మూడు రోజులు పొడిగించింది.

కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, మరికొందరితో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. కవిత కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు వెల్లడించలేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని ఈడీ తెలిపింది. మద్యం కేసులో సమీర్ మహేంద్రును విచారించాల్సి ఉందన్న ఈడీ, మేకా శరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని వెల్లడించారు.

మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఇప్పటికే కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్, కవితను ఒకేసారి ప్రశ్నించే యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. ఇద్దరినీ కలిపి ప్రశ్నించేందుకు కవిత కస్టడీ పొడిగింపు కోరారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు, కవితకు వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని కోర్టుకు వివరించారు.

కవిత ఈడీ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు ముగియడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు సీబీఐ కోర్టులో కవిత తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. మరోవైపు కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. తనను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు.