ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్..

ఏపీలో వైద్య విద్యార్థులు డ్రెస్ కోడ్ విధించింది రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ). జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని ఆదేశించింది. అంతేకాదు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా జీన్స్ ధరించకూడదని తెలిపింది. ఇకపై మహిళా విద్యార్థులు చీరలు, లేదంటే చుడీదార్లు మాత్రమే ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

డీఎంఈ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బోధనాసుపత్రులకు పంపిన సూచనల్లో డ్రస్‌ కోడ్‌ను ప్రస్తావించారు. వైద్య విద్యార్థులు, వైద్యుల డ్రస్‌ కోడ్‌ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులు తప్పనిసరిగా చీర గానీ చుడీదార్‌ గానీ ధరించాలని, జుట్టు వదులుగా వదిలేయకుండా ముడి వేసుకోవాలని తెలిపారు. విధుల్లో ఉన్నప్పుడు యాప్రాన్‌ను ధరించడంతో పాటు మెడలో స్టెతస్కోప్‌ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా మగవాళ్లు గడ్డం గీసుకోవాలని సూచించారు. నిబంధనలకు లోబడి డ్రస్‌ కోడ్‌ను కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది పాటించకపోవడాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బోధనాసుపత్రులకు ఎవరైనా వచ్చిన రోగులను ఆసుపత్రిలో చేర్చుకోవాల్సి వస్తే.. హెల్పర్స్‌ లేరనే కారణంతో తిరస్కరించొద్దని అధికారులు తెలిపారు.