సమస్యలకు కుంగిపోకూడదు

మేడమ్‌! నా పేరు లక్ష్మి. నా వయసు 48 సంవత్సరాలు. మాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి. మాకు ఈ మధ్యనే వ్యాపారంలో కొన్ని నష్టాలు వచ్చాయి. దాని వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా అమ్మాయిలకు కట్నం ఇవ్వాలి. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలి. ఏమి చెయ్యాలో తోచటం లేదు. ఈ విషయమై ఆలోచిస్తూ నాకు ఆరోగ్యం చెడిపోతోంది. ఏమి చేస్తే నాకు మరల మంచి జీవితం వస్తుందో కొంచెం వివరించండి. – లక్ష్మి

Sad Lady
Sad Lady

మీరు తప్పక ఈ సమస్యల నుండి బయట పడగలరు. మా అమ్మాయిల పెళ్లిళ్లు కూడా అవ్ఞతాయి. దాని గురించి ఆందోళన చెందవద్దు. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, ఆశావహదృక్పథంతో, సానుకూల దృక్పథంతో అన్నీ సాధ్యమవుతాయి. ముందుగా స్పష్టంగా, వివేకంతో ఆలోచించాలి. సమస్యలతో కుంగిపోకూడదు. దానిని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచిస్తే, ఎన్నో పరిష్కార మార్గాలు మనకు దొరుకుతాయి. సమస్యలు వస్తూపోతూ ఉంటాయి.

అందువల్ల వాటి గురించి దిగులు పడకూడదు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. జీవితం అమూల్యమైనది. ఈ అమూల్యమైన జీవితం ముందు ఏ సమస్య అయినా చిన్నదే. జీవితంలో ఆనందించే విషయాలు చాలా ఎక్కువ. సమస్యలు పోలిస్తే, సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల జీవిత మాధుర్యాన్ని చూడాలే తప్ప, జీవితంలోని చిన్న చిన్న సమస్యలకు పెద్ద పీట వేయకూడదు. వ్యాపారంలో లాభనష్టాలు సర్వసాధారణం. కొంచెం జాగ్రత్త వహించి వ్యాపారాన్ని చక్కబెట్టుకోండి. తప్పక లాభాలు వస్తాయి. అందుకోసం తగిన విజ్ఞానాన్ని అలవర్చుకోండి. వ్యాపారం ఎలా చక్కగా చేసుకోవాలో నేర్చుకోండి. అపుడు తప్పక సఫలీకృతులవ్ఞతారు. ఇందులో అనుమానం లేదు. వర్తమానంలో జీవించండి. ఉత్సాహంగా పనులు చేసుకోండి. మానవజన్మ యొక్క విలువను తెలుసుకోండి. ప్రతి నిత్యం ఆనందంగా ఉండండి.

ఎదుటి వ్యక్తిని అర్ధం చేసుకోండి

మేడమ్‌! నా పేరు సులోచన. నా వయసు 35 సంవత్సరాలు. ఒక్క పాప. మాకు ఆర్ధిక ఇబ్బందులు ఏమీలేవ్ఞ కానీ, ఇంట్లోనే చికాకులు. నాకు, నా భర్తకు పడటం లేదు. మా పాప విషయమై, మా అత్తమామల విషయమై, మా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మేమిద్దరం పోట్లాడుకుంటున్నాము. ఈ బాధల నుండి బయట పడేదలా? కొంచెం చెప్పండి. – సులోచన

మీరు తప్పక చక్కగా ఉండగలరు. కొంచెం ఆవేశం తగ్గించుకోండి. నిదానంగా ఆలోచించండి. ఎదుటి వ్యక్తిని కూడా అర్ధం చేసుకోండి. మీరు మీ భర్తను అర్ధం చేసుకోవాలి. మీలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ వల్ల ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించమని కోరండి. అప్పుడు మీ భర్త కూడా మిమ్మల్ని అర్ధం చేసుకొంటారు. తనకోపమే తన శత్రువ్ఞ అని అంటారు. అది పూర్తిగా నిజం. కోపం, ఆందోళన వల్ల మనసు ఎంతో అశాంతిగా ఉంటుంది. అందువల్ల వాటికి దూరగా ఉండాలి. నిత్యం, ఆనందంగా, సంతృప్తిగా, ఉత్సాహంగా ఉండాలి. అప్పుడు మీలో దయాగుణం, ఉదారత బయటకు వస్తాయి. అందువల్ల ఆనందంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. మనం అసంతృప్తితో ఉంటే ఎదుటి వారి మీద త్వరగా కోపం, అసహనం వచ్చేస్తాయి.
అందువల్ల మీరు మీ ఉద్వేగాలను అర్ధం చేసుకుని నియంత్రణలో అదుపులో పెట్టుకోవాలి. ఉద్వేగాలు నియంత్రణలో ఉండాలంటే మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండి ఉత్సాహాన్నిచ్చే కార్యక్రమాలలో పాల్గొనాలి. అపుడు మీరు ఎంతో ఆనందభరితమైన జీవితాన్ని సొంతం చేసుకొంటారు. ప్రేమ, ఆప్యాయతలను పంచుకోగలుగుతారు. అందువల్ల మీరు మిమ్మల్ని బాగా చూచుకోవాలి. మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవాలి. దయ, ఆర్ధ్రతను కలిగి ఉండాలి.

  • డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/