విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలు టికెట్ ఎంతో తెలుసా..?

ఈ నెల 19 నుండి తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైలు పరుగులు పెట్టబోతోంది. సికింద్రాబాద్ నుండి వైజాగ్ కు ఈ రైలు ప్రయాణించబోతుంది. 19 న వందేభారత్ రైలును ప్రధాని మోడీ ప్రారభించబోతున్నారు. దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లను ప్రధాని స్వయంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలు కేటాయిస్తూ రెండు నెలల క్రితం ప్రధాని అటు విశాఖ..ఇటు తెలంగాణలోని రామగుండం పర్యటన సమయంలో నిర్ణయం జరిగింది. వందేభారత్ ను ప్రారంభించటంతో పాటుగా సికింద్రబాద్ రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందు కోసం రూ 699 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత భవనాలను కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు.. పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మించనున్నారు. 36 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి.

దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే సెమీ హైస్పీడ్ రైలు. గతేడాది భారత రైల్వే 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్- ముంబయి సెంట్రల్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూరు, బిలాస్ పూర్-నాగపూర్, హౌరా-న్యూ జల్పాయ్ గురి స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం అందుకోవడం విశేషం.

ఇక సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య నడవనున్న వందేభారత్ రైలు జనవరి 19 న ప్రారంభమైనప్పటికీ , ఆ రోజు మాత్రం ప్రయాణికులను అనుమతించరు. వారికి ఈ రైలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేది రైల్వే అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే దురంతో రైలు 10.10 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. వందేభారత్‌ రైలు మాత్రం 8.40 గంటల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది. అంటే గంటన్నర ముందే గమ్యాన్ని చేరుకుంటుందన్నమాట. కాకపోతే వందే భారత్ రైలు టికెట్ ధర గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఢిల్లీ-జమ్మూలోని కట్రా మధ్య ప్రస్తుతం వందేభారత్ రైలు నడుస్తోంది. ఆ రెండు నగరాల మధ్య దూరం 655 కిలోమీటర్లు. చైర్ కార్ టికెట్ ధర రూ. 1,665 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,055. ఈ లెక్కన చూసుకుంటే సికింద్రాబాద్-విశాఖ టికెట్ ధరలు ఇంతకంటే ఎక్కువే ఉంటాయని అంచనా. ఎందుకంటే ఢిల్లీ-కట్రా మధ్య ఉన్న దూరంలో పోలిస్తే విశాఖ-సికింద్రాబాద్ మధ్య దూరం ఎక్కువ. కాబట్టి చార్జీలు భారీగానే ఉండే అవకాశం ఉంది.

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. విశాఖపట్టణంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మధ్యలో రాజమండ్రి(8.08), విజయవాడ(9.50), వరంగల్‌(12.05)లో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.25 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. మధ్యలో వరంగల్ (4.25), విజయవాడ (7.10), రాజమండ్రి (9.15) ఆగుతుంది. వందేభారత్ రైలు ఆగే స్టేషన్లలో ఖమ్మంను కూడా చేర్చినప్పటికీ సమయాలను మాత్రం వెల్లడించలేదు.