సహజీవనానికి ప్రేమ ముసుగు వద్దు

వ్యధ-మానసిక సమస్యలకు పరిష్కారం

Do not want the mask of love for cohabitation-
Do not want the mask of love for cohabitation

మలి వయస్సు ప్రేమ నాకు మానసిక క్షోభను కలిగిస్తోంది. ప్రేమకు వయసు, కులము, డబ్బు, హోదా అడ్డుకావంటే ఎవరూ సమ్మతిండంలేదు.

భర్తను కోల్పోయి ఒంటరి తనంతో ఉన్న నేను ఆదరించిన వ్యక్తిని ప్రేమించడాన్ని సమాజం తప్పుపడుతున్నది. నాకు తోడు పిల్లలకు నీడనిస్తున్న ఆ ఉన్నతునిపై వారి కుటుంబ సభ్యులు నిందలువేస్తున్నారు.

పోలీసులు, చట్టాలు కూడా మా ప్రేమను సమ్మతించవంటున్నారు. నన్ను నా పిల్లల్ని మరోదారి చూసుకోమంటున్నారు.

కట్టుకున్న భర్త కాటికిపోయి, నమ్ముకున్న రెండో భర్త వదిలేస్తే ఆ బతుకేమికావాలి? దీనికి జవాబు చెప్పేవారు ఎవరు? ఎవరికీ కానప్పుడు బతకడం వృధా అనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకుని చావాలంటే భయమేస్తోంది.

ఈ అయోమయ పరిస్థితులలో సరైన దారికోసం వెదుకుతున్నాను. నా వయసు 38 సంవత్సరాలు. నేనొక ఉన్నత వర్గానికి చెందిన మహిళను డిగ్రీ వరకు చదివాను. 15 ఏళ్ల వయసులో మా బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను.

మేమిద్దరం అన్యోన్యంగా కాపురం సాగించాము. ఇద్దరు పిల్లలు పుట్టారు. పాప ఎనిమిదవ తరగతి, బాబు ఐదవ తరగతి చదువుతున్నారు. ఐదేళ్ల క్రితం మా వారు ప్రమాదంలో చనిపోయారు. నేనొక ప్రయివేటు సంస్థలో ఉద్యోగంలో చేరి పిల్లల్ని పోషించడం ప్రారంభించాను. ఈ క్రమంలో మా కంపెనీ మేనేజరు నాకు అప్పుడప్పుగు సాయం చేస్తూ అదుకునేవారు. ఆయన మంచి హృదయం ఆత్మీయత నన్ను ఆకర్షించాయి. దీంతో ఆయనపై ప్రేమ చిగురించింది.

ఆయనకు నేనంటే ఇష్టం కావడంతో క్రమంగా మనసులు, ఆపై శరీరాలు కలిశాయి. ఆయనకు అప్పటికే పెళ్లయి ఒక కొడుకు ఉన్నాడు. అతను బి.టెక్‌ చదివి ఉద్యోగం చేస్తున్నాడు.

అయినా ప్రేమకు హద్దులు, పరిమితులు ఉండరాదని భావించాము. మిత్రుల సమక్షంలో గుడిలో పెళ్లాడాము ఆయన వయస్సు 50ఏళ్లు. లక్షరూపాయల జీతం, ఇతర కమిషన్లు వస్తుంటాయి. జీతం పూర్తిగా భార్యా, బిడ్డలకే ఇచ్చేస్తుంటారు.

అదనపు ఆదాయం నా కోసం ఖర్చు చేస్తుంటారు. నా ఇద్దరు పిల్లల్ని కూడా తన పిల్లల్లాగే చూసుకుంటాడు. ఆయన కుటుంబం పక్క జిల్లాలో ఉంటుంది. వారం, వారం అతను ఇంటికి వెళ్లివస్తుంటారు. మా పెళ్లి విషయం రహ్యసంగానే ఉంచాము.

అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఆయన తన మొదటి భార్యతోనే, వారి ఇంటి వద్దనే ఉండాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ మెసేజ్‌లు ఛాటింగ్‌తో మాకు శరణ్యం అయ్యింది.

నెలక్రితం అతని ఫోన్‌ భార్య పరిశీలించడంతో విషయం తెలిసిపోయింది. ఆమె నిలదీయడంతో అతను అన్ని విషయాలు చెప్పేశాడు.

దీంతో ఆమె తన బంధువులను వెంటబెట్టుకుని నా వద్దకు వచ్చి బెదిరించింది. మా అన్న, తల్లితండ్రులకు తెలియజేసింది.

వారు బలహీన వర్గానికి చెందిన వారని తెలియడంతో మా బంధువ్ఞలు నన్నే తప్పుపట్టారు. ఇలాంటి వ్యవహారాల వల్ల ఆ పిల్లలకు పెళ్లి కాదని హెచ్ఛరించారు.

అతని కులం వేరు కావడం వల్ల మా బంధువులు, కులస్తులు ఎవరూ మాతో సంబంధం కుదుర్చుకోరని భయపెట్టారు. అతనితో సంబంధం తెగతెంపులు చేసుకోమని నాకు మా వారంతా సలహా ఇచ్చారు.

అయినా నేను ఎవరిమాట వినకూడదని భావించాను. ఆయనకు నాకు లేని కులం పట్టింపులు మీకెందకని ఎదురుతిరిగాను.

నా భర్త మొదటి భార్య, కొడుకు వారి బంధువులనుంచి నాకు బెదిరింపులు ఎదురు కావడంతో పోలీసులకు ఆశ్రయించాను.

వారు మా కథంతా విని మా పెళ్లి చెల్లదని, దీనిలో జోక్యం చేసుకోలేమని, తేల్చేశారు పైగా ఇలాంటి బంధాలు మంచివికావని, అతని జీవితంలో నుంచి వైదొలగడమే మంచిదని సలహా ఇచ్చారు. ఆయన మాత్రం ఇద్దరికీ న్యాయం చేస్తామని అంటున్నారు.

అయితే అతని మొదటి భార్య, కొడుకు సమ్మతించడంలేదు. అతనిపై ఒత్తిడి తీసుకొచ్చి నా వద్దకు రాకుండా అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నా ప్రేమను బతికించుకుని, నా తాళికి విలువ కల్పించుకునే మార్గం చెప్పండి. – సుహాసిని, ప్రకాశం జిల్లా.

అమ్మా, మీది ప్రేమకాదు, మీ పెళ్లికి విలువలేదని మొదట గుర్తించండి. మీరు అవసరంకోసం ఆయనకు దగ్గరయ్యారు. ఆయన వ్యామోహంతో మిమ్మల్ని చేరదీశారు.

ఈ వాస్తవానికి ప్రేమ ముసుగు వేయకండి. భారతీయ సంస్కృతి, ధర్మం, ఆచారాలు, పద్ధతులు వివాహేతర బంధాలను అంగీకరించవు.

భార్యలేక భర్త బతికి ఉండగా, విడాకులు పొందకుండా రెండవ పెళ్లిచేసు కోడాన్ని మన చట్టాలు కూడ సమ్మతించవు.

అయితే కొత్తగా సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మీరు కలిసి సహజీవనం చేయడాన్ని చట్టాలు సమ్మతిస్తాయి. అయితే సామాజిక ధర్మాలు దీనిని సహించవు.

కాబట్టి అతను మీ సొంతమనుకోవడం, మీది పవిత్ర ప్రేమగా చిత్రీకరించడం మానుకోండి.

అందరి శ్రేయస్సుకోరి మీ వివాహేతర లేదా సహా జీవన బంధాన్ని తెంచుకోవడమే మంచిది. మీ అన్న, తల్లిదండ్రులు చెప్పినట్టు మీ వ్యవహారం మీ పిల్లల పెళ్లి సమయంలో సమస్యగా మారవచ్చు.

ఇదిలా ఉండగా మీ పిల్లలు పెద్దవారైన తరువాత తండ్రికాని వ్యక్తిని తండ్రిగా సమ్మతించకపోవచ్చు.

ఒకవేళ వారు తలవంచినా వారి జీవిత భాగస్వాములు సమ్మతించకపోవచ్చు. మరొక కోణంలో చూస్తే ఇప్పటికే మీ పిల్లలు మానసికంగా బాధపడుతుండవచ్చు.

మీ వ్యవహారం తెలిసిన స్నేహితులు ఎవరైనా అవహేళన చేస్తే ఆ చిన్నారి హృదయాలు తట్టుకోలేవు. అన్న విషయం గుర్తిం చండి.

తోడు, నీడ కరమైన మీ మనసు నా మాటల్ని కూడా అంగీకరించదని నాకు తెలుసు. మన సమాజంలో ఉన్నాము.

ఇక్కడ సొంత ఇష్టాలు కోర్కెలకంటే, సాంప్రదాయాలు, చట్టాలకు ఎక్కువ విలువ ఇవ్వక తప్పదు.

మొండిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మీ పిల్లలే మిమ్మల్ని తిరస్కరించే ప్రమాదం ఉంది.

కాబట్టి మీరు దగ్గరలోని సైకాలజిస్టును కలిసి కౌన్సెలింగ్‌ తీసుకొండి మీలో వివేకం కలిగించి, ప్రవర్తన ఆలోచనల్లో మార్పుకు కృషి చేస్తారు.

స్వార్థంకంటే త్యాగం గొప్పదని విశ్వసించి, పిల్లలు, రెండు కుటుంబాలకోసం మీ బంధాన్ని త్యాగం చేయండి.

-డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు