మునుగోడు ఓటర్లకు రాజకీయ పార్టీల దీపావళి గిఫ్ట్ లు..మాములుగా లేవు

diwali-dhamaka-offer-to-munugode-voters

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఓటర్లంతా మునుగోడులో ఓటు హక్కు ఉంటె బాగుండని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓటర్లను రాజకీయ పార్టీలు ఆలా చేసుకుంటున్నాయి. మాములుగా అయితే ఓటరుకు ఓ వెయ్యో..ఐదు వందలు ఇస్తే సరిపోతుంది. కానీ మునుగోడు లో అలా కాదు ఎలాగైనా గెలిచి తీరాలని కసి మీద ఉన్న పార్టీలు డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా ఖర్చు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లను ఆకర్షించుకునేందుకు రకరకాల విందు , వినోదాలతో పాటు మద్యం , డబ్బు , నాన్ వెజ్ ఇలా ఒకటేంటి ఎన్ని అంటే అన్ని ఇస్తున్నారు.

ఇప్పటికే దసరా పండుగ సందర్భంగా ఇంటింటికీ చికెన్, మటన్ పంపించిన రాజకీయ పార్టీల నాయకులు, ఇప్పుడు మునుగోడు ఓటర్లకు దీపావళి ధమాకా ఆఫర్లతో సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా మునుగోడు ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం మహిళలకు చీరలు, పిల్లలకు స్వీట్లు, బాణాసంచా బ్యాగులు సిద్ధం చేస్తున్నారు. ఇక పురుషులకు తిన్నంత నాన్వెజ్, తాగినంత మద్యం పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. యువతను ఆకట్టుకోవడానికి, వారి ఎంటర్టైన్మెంట్ కోసం స్పెషల్ ప్యాకేజీ లను కూడా సిద్ధం చేస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు. యువతకు కొత్త బట్టలు కొని ఇస్తూ, ఇంటింటికీ పండుగ తోఫా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో ఉన్న బెల్టుషాపులను గుత్తకు తీసుకున్న రాజకీయ పార్టీల నాయకులు, అక్కడికి వచ్చే గ్రామస్తులకు మద్యంతో పాటు, మంచింగ్ కూడా ఇవ్వాలని ఏర్పాట్లు చేశారు. ఇక హోటళ్ళను సైతం గుత్తకు తీసుకుని మరీ తినిపిస్తున్నారు.