ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు..త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు

fire-breaks-out-in-rtc-bus-at krishna-district

విజయవాడ: 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కృష్ణాజిల్లా పులవర్తి గూడెం వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విజయవాడ నుండి గుడివాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిసి మొత్తం 40 మంది బస్సులో ఉన్నారు. ఇంజిన్‌ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌.. అప్రమత్తమై బస్సును నిలిపేశారు. వెంటనే ప్రయాణికులు, విద్యార్థులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.

సాంకేతిక లోపంతోనే బస్సులో మంటలు చెలరేగి ఉంటాయంటున్నారు అధికారులు. బస్సుకు మంటలు వ్యాపించిన విషయాన్ని సిబ్బంది ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా మంటలు చెలరేగిన నేపథ్యంలో బయటకు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలేయడంతో అవన్నీ కాలి బూడిదయ్యాయి. బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పలువురు ప్రయాణికులు వాపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.