అఫిడవిట్‌లో రాహుల్‌ గాంధీ ఆస్తుల వివరాలు వెల్లడి

details of Rahul Gandhi assets are revealed in the affidavit

న్యూఢిల్లీః కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదట.. సొంతంగా ఒక్క కారు కూడా లేదని ఎన్నికల సంఘానికి ఆయన వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీకి పొరుగునే ఉన్న మెహ్రౌలీలో తనకూ, తన సోదరి ప్రియాంక గాంధీకి ఉమ్మడిగా 3.7 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. గురుగ్రామ్ లోని సిగ్నేచర్ టవర్ లో తనకు ఓ కమర్షియల్ అపార్ట్ మెంట్ ఉందని వెల్లడించారు. అన్ని స్థిర చరాస్తులు కలిపి మొత్తంగా రూ.20 కోట్ల ఆస్తులు, రూ.50 లక్షల అప్పులు ఉన్నాయని రాహుల్ గాంధీ వివరించారు.

కేరళలోని వయనాడ్ నుంచి లోక్ సభకు పోటీ చేసిన రాహుల్ గాంధీ.. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి కూడా ఎన్నికల బరిలో నిలిచారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అందజేసిన అఫిడవిట్ లో రాహుల్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. రూ. 20 కోట్ల ఆస్తులలో రూ.4.3 కోట్ల విలువైన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూ.3.81 కోట్లు, బ్యాంకులో నగదు రూ.26,25,157, రూ.15 లక్షల విలువైన గోల్డ్ బాండ్స్ సహా మొత్తం రూ. 9,24,59,264 విలువైన చరాస్తులు ఉన్నాయని వివరించారు.

స్థిరాస్తుల విషయానికి వస్తే.. రూ.2.10 కోట్ల విలువైన ఆస్తులను వారసత్వంగా అందుకున్నానని, రూ.9 కోట్ల విలువైన స్థిరాస్తులను తన సంపాదనతో కొనుగోలు చేశానని రాహుల్ చెప్పారు. మొత్తంగా స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.11.15 కోట్లు అని వెల్లడించారు. దీంతో పాటు రూ.4.20 లక్షల విలువైన 333 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నాయని, రూ.55 వేలు నగదు ఉందని రాహుల్ గాంధీ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.