ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపులు

delhi-public-school-mathura-road-receives-bomb-threat

న్యూఢిల్లీః ఢిల్లీ నగరంలోని మధుర రోడ్‌ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్‌ వచ్చింది. అందులో పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు , బాంబు స్వ్కాడ్‌ పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు వారికి లభించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ-మెయిల్‌ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు.

కాగా, ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు పలు పాఠశాలలకు ఫోన్‌కాల్స్‌, ఈ-మెయిల్స్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. రెండు వారాల క్రితం కూడా ఇదే తరహాలో దిల్లీ పాఠశాలకు ఈ-మెయిల్ వచ్చింది. సాదిఖ్ నగర్‌ లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో బాంబులు ఉన్నాయని అందులో పేర్కొనడంతో ఆందోళనకు గురైన యాజమాన్యం.. విద్యార్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించింది. అనంతరం పోలీసులు పాఠశాల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.