ఢిల్లీ మెట్రో ట్రైన్లో విషాదం

ఢిల్లీ మెట్రో ట్రైన్ (Delhi Metro Rail) లో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న రైలు కింద పడి మహిళ మృతి ఘటన ఇందర్‌లోక్ స్టేషన్‌లో జరిగింది. రీనా (35) అనే మహిళ చీర ట్రైన్ తలుపుల మధ్య చిక్కుకుని కింద పడిపోయింది. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు ఢిల్లీ మెట్రోస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనూజ్ దయాళ్ చెప్పారు.

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 14న ఇంద్రలోక్ మెట్రో స్టేషన్‌లో మహిళ తన కుమారుడితో కలిసి నంగ్లోయ్ నుండి మోహన్ నగర్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇక ప్రమాదానికి గురైన మహిళను రీనా దేవిగా గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆమె భర్త ఏడేళ్ల క్రితమే చనిపోయాడని, ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని ఆమె బంధువు విక్కీ తెలిపారు.

ఢిల్లీ మెట్రో డోర్ సెన్సార్ మహిళ దుస్తుల ఉనికిని గుర్తించడంలో విఫలమై ప్రమాదానికి దారితీసిందని ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రైలు అనేక మీటర్లు బాధితురాలిని ఈడ్చుకుంటూ వచ్చింది. దాని కారణంగా ఆమె చివరకు పట్టాలపై పడిపోయింది. ఘటన జరిగిన వెంటనే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లి న్యూరో సర్జరీలోని ఐసీయూ వార్డులో చేర్చారు. డాక్టర్స్ ఆమె ప్రాణాలు కాపాడేందుకు ట్రై చేసినప్పటికీ చివరకు ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.