సీటు బెల్టు పెట్టుకొని ఉంటె సైరస్ మిస్త్రీ బ్రతికేవారట..

వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండ బెల్టు పెట్టుకోవాలని అంత పదే పదే చెపుతుంటారు. కానీ కొన్నిసార్లు ఎందుకులే అని నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ఆ సమయంలోనే మృతువు మనల్ని తిరిగిరాని లోకానికి చేర్చుతుంది. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టాటా గ్రూప్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ విషయంలోనూ అదే జరిగింది. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే ఆయన మరణించారని పోలీసులు చెపుతున్నారు. ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన మరణించిన సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్‌ నుంచి మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో ముంబై వస్తుండగా పాల్ఘార్‌ జిల్లాలోని సూర్య నదిపై ఉన్న బ్రిడ్జిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు బ్రిడ్జిపై ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన దర్యాప్తు చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి. కారు వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ అసలు సీటు బెల్టే పెట్టుకోలేదని విచారణలో తెలిసింది. ఆయనతో పాటు పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా సీటు బెల్ట్ పెట్టుకోలేదని.. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ఉండేవని దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారు. సీటు బెల్ట్ ధరించకపోవడం, మితిమీరిన వేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసు వర్గాలు చెప్పాయి. రాంగ్‌ రూట్‌లో మరో వాహనాన్ని ఎడమ పక్క నుంచి ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు.