బిజేపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత భిక్షమయ్య గౌడ్

న్యూఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్య‌వ‌హారాల ఇంఛార్జీ త‌రుణ్ చుగ్ స‌మ‌క్షంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ బిజేపిలో చేరారు. ఈసందర్బంగా తరణ్ చుగ్ భిక్షమయ్య గౌడ్ కు కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తోపాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఆలేరు నియోజ‌కవ‌ర్గం అభివృద్ధి కోసం 2018లో తాను టీఆర్ఎస్ లో చేరాన‌ని మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ అన్నారు. అభివృద్ధిలో త‌న‌ను భాగ‌స్వామిని చేస్తార‌ని భావించాన‌ని, కానీ త‌న‌ను ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా అడ్డుకున్నార‌ని మండిపడ్డారు. ఆలేరు నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి త‌న‌ను వేరు చేయాల‌ని కుట్ర చేశార‌ని ఆరోపించారు. నియోజ‌క వ‌ర్గం ప్ర‌జ‌లతో తాను స‌మావేశం కావ‌ద్ద‌ని టీఆర్ఎస్ పెద్ద‌లు త‌న‌ను ఆదేశించార‌ని తెలిపారు. ఆలేరు నియోజ‌క వ‌ర్గం ప్ర‌జ‌ల కోసం బీజేపీలో చేరినట్లు ప్ర‌క‌టించారు. కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న భిక్షమ‌య్య గౌడ్.. 2018లో టీఆర్ఎస్ లో చేరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/