హైదరాబాద్ నగర వాసులకు మెట్రో తీపి కబురు

హైదరాబాద్ నగర వాసులకు మెట్రో తీపి కబురు తెలిపింది. రేపట్నుంచి (నవంబర్ 10 ) ఉదయం 6 గంటలకే తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. రాత్రి 10:15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయల్దేరనుంది. చివరి రైలు గమ్యస్థానానికి 11:15 గంటలకు చేరుకోనుంది.
అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ఉదయం వేళ మెట్రోరైలు ఫ్లాట్‌ఫామ్‌ల వద్ద రైళ్ల కోసం ఎదురు చూస్తున్న జనం రద్దీ, వృద్ధులు, మహిళలు పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా సోమవారం ట్యాగ్ చేశారు. తెల్లవారుజామునే నగరానికి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు సరిగాలేక ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6 నుంచే మెట్రోరైళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. మెట్రో రైల్ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మెట్రో రైల్ సేవల వేళ్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 6 కే మెట్రో సేవలు అందుబాటులోకి రావడం పట్ల నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.