రాహుల్ విమర్శలపై స్పందించిన కిషన్‌రెడ్డి
సమతా విగ్రహాన్ని చైనాలో తయారు చేయించడం ఏమిటన్న రాహుల్ గాంధీ

హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుడి సమతా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల దానిని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని చైనాలో తయారుచేయించడంపై రాహుల్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమతా విగ్రహం చైనాలో తయారైందని, నవభారత్ అంటే చైనాపై ఆధారపడడమేనంటూ ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాహుల్ విమర్శలపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఈ వ్యాఖ్యలతో రాహుల్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. సమతా విగ్రహం తయారీకి, బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎనిమిదేళ్ల క్రితమే విగ్రహం తయారీ ప్రారంభమైందని, అప్పట్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. విగ్రహ తయారీకి అవసరమైన నిధులన్నీ ప్రైవేటుగా సమకూర్చినవేనని అన్నారు. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌కు పిలుపునివ్వకముందే విగ్రహ తయారీ ప్రారంభమైందని, రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అంతేకాదు, చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం చేసుకున్న పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/