ఎవ‌రి వ‌ల్ల పాలేరుకు మోక్షం వ‌చ్చిందో మీకు అంద‌రికీ తెలుసుః సిఎం కెసిఆర్‌

CM KCR Public Meeting In Paleru

ఖ‌మ్మం : సిఎం కెసిఆర్‌ శుక్రవారం పాలేరులో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌ల్లే పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి మోక్షం ల‌భించింద‌ని సిఎం కెసిఆర్ స్ప‌ష్టం చేశారు. నిన్న‌మొన్న‌టి దాకా కెసిఆర్ వ‌ల్ల మోక్షం వ‌చ్చింద‌ని మాట్లాడిన నాలుక‌లు.. న‌రం లేని నాలుక కాబ‌ట్టి వారే ఉల్టా మాట్లాడుతున్నారు. న‌రం లేని నాలుక మారొచ్చు కానీ స‌త్యం మార‌దు. నిజం నిజం లాగే ఉంటుంది. నిజం నిప్పులాంటింది క‌దా..? ఎవ‌రి వ‌ల్ల పాలేరుకు మోక్షం వ‌చ్చిందో మీకు అంద‌రికీ తెలుసు అని కెసిఆర్ పేర్కొన్నారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కెసిఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

రాష్ట్ర ఏర్పాటు కోసం 24 ఏండ్ల క్రితం ఈ జెండా ఎత్తి, ఉద్య‌మాన్ని పిడికెడు మందితో ప్రారంభించుకున్నాం అని కెసిఆర్ తెలిపారు. ఉద్య‌మ ప్రారంభంలో చాలా అవ‌మానాలు, అవ‌హేళ‌న చేశారు. తెలంగాణ ఎట్ల వ‌స్త‌ది.. సాధ్యం కాదు.. కెసిఆర్ బ‌క్క ప‌ల‌చ‌నోడు ఎవ‌డో పిసికి చంపేస్త‌డు అని మాట్లాడారు. కానీ 14, 15 ఏండ్లు పోరాటం త‌ర్వాత యావ‌త్ తెలంగాణ ఒక ఉప్పెన అయి క‌దిలేతే దేశ రాజ‌కీయ ప‌రిస్థితి త‌ల‌వంచి తెలంగాణ ఇచ్చింది అని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చే పరిస్థితిని సృష్టించి సాధించుకున్నాం.

కాంగ్రెస్ ఢోకా చేయాలని చూసింది. కానీ కెసిఆర్ శవయాత్రనా- జైత్రయాత్రనా అని పిలుపునిచ్చా. ఆ రోజు నన్ను ఖమ్మం జైలులో పెట్టారు. అలుపెరగని పోరాటం చేశాం కాబట్టే రాష్ట్రం వచ్చింది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నాతో ఓసారి పాలేరుకు వచ్చారు. 45 ఏళ్లలో కరువుతో ఉండేది అని… కానీ భక్తరామదాసుతో నీళ్లిస్తున్నారని ఆరోజు నాతో చెప్పారు. పాలేరును నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పాలేరును మోక్షం లభించిందంటే అది బీఆర్ఎస్ తోనే. భక్త రామదాసుతో నీళ్లిచ్చాం. ఎండిపోయిన పాలేరు చెరువులు ఇవాళ నిండి కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు మనతో ఉన్న నేతలే ఈ విషయాన్ని చెప్పారని… కానీ ఇవాళ పక్క పార్టీల్లోకి వెళ్లి ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశాం. పాలేరులో 40 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశాం. పాలేరు నియోజకవర్గంలో భూముల ధర చూస్తేనే అర్థమవుతోంది. ఇవాళ ఎకరం ధర 30 నుంచి 50 లక్షల వరకు పలుకుతుంది.

ఉపేంద‌ర్ రెడ్డి ఉప‌న్యాసం విన్నాను అని కెసిఆర్ తెలిపారు. అది ఉప‌న్యాసం లాగా లేదు. ఇంటి మ‌న‌షుల‌తో మాట్లాడిన‌ట్లు ఉంది. నా సెల్ ఫోన్ నంబ‌ర్ మీ ద‌గ్గ‌ర ఉందా? అని అడిగారు. ఇది నాయ‌క‌త్వ ల‌క్ష‌ణం. ప్ర‌జ‌ల్లో క‌లిసిపోయి మాట్లాడే నాయ‌కులు చాలా త‌క్కువ‌గా ఉంటారు. ఉపేంద‌ర్ రెడ్డి ఎమ్మెల్యేగా మీకు ఉండ‌టం అదృష్టం అని కేసీఆర్ అన్నారు.