రోడ్డు ప్రమాదంపై సిఎం కెసిఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి..మృతులకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్ః ఏపి, గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆరుగురు గిరిజన కూలీల దుర్మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలకు ఆటోలో వెళ్తుండగా లారీ వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్సను అందించాలని స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావును ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రమాద ఘటనను వివరించి తగు సహాయం చేయాలని కోరడంతో వెంటనే స్పందించిన సీఎం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.