వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్స‌వం సందర్భంగా సీఎం జ‌గ‌న్ ట్వీట్

దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం..జగన్

cm jagan

అమామరావతి: నేడు ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేత‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స్పందిస్తూ… ”దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి” అని ఆయ‌న ట్వీట్ చేశారు.

మ‌రోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఆ పార్టీ నేత‌లు పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేస్తున్నారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లతో క‌లిసి పాల్గొన్నారు.

తాడేపల్లిలో త‌మ పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఈ వేడుక‌ల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త‌మ‌ పార్టీ నడుస్తోందని చెప్పారు. జ‌గ‌న్ త‌న‌ను తాను ఒక సమర్థమైన సీఎంగా నిరూపించుకున్నారని ఆయ‌న తెలిపారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్రజల కోసం సమైక్యంగా ముందుకు నడవాలని అన్నారు. జ‌గ‌న్ అందరికీ న్యాయం చేయడమే ల‌క్ష్యంగా పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

ఏపీ మంత్రి అదిమూలపు సురేశ్ వైసీపీ నేత‌లు, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ‌ శుభాకాంక్షలు తెలిపారు. తాము పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే అధికారంలోకి వచ్చామ‌ని చెప్పారు. గొప్ప‌ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంద‌ని తెలిపారు. వైఎస్ జగన్ ఏపీకి 30 ఏళ్ల‌పాటు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయ‌న అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/