వాట్సాప్ సేవల అంతరాయం ఫై యాజమాన్యం క్లారిటీ

ఉదయం లేచినదగ్గరి నుండి నిద్రపోయేవరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ లోనే మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అలాంటిది మంగళవారం మధ్యాహ్నం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు మెసేజ్‌లు పంపేందుకు, రిసీవ్‌ చేసుకొనేందుకు వీలుకాలేదు. దీంతో వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అసలు ఎందుకు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయా అని ఆరాతీసారు. రెండు గంటల అంతరాయం తర్వాత వాట్సప్ సేవలు పునరుద్ధరించడంతో వినియోగదారులకు ఉపశమనం కలిగింది. కాగా, వాట్సప్ సేవలకు ఎందుకు అంతరాయం కలిగిందో దాని యాజమాన్యం అయిన మెటా వివరణ ఇచ్చింది.

మెటా ప్రతినిధి ఒకరు ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ.. తమ వైపు నుంచి సాంకేతిక లోపం కారణంగా వాట్సప్ కొద్దిసేపు ఆగిపోయిందని తెలిపారు. ఆ సాంకేతిక లోపానికి కారణం ఏమిటనే విషయాన్ని మాత్రం మెటా వెల్లడించలేదు. కాగా, ఆరేళ్ల కిందట ఇదే అక్టోబర్ లో వాట్సప్ కొద్దిసేపు ఆగిపోయింది. ఆ సమయంలో డీఎన్ఎస్ (డొమైన్ నేమ్ సిస్టమ్) సంబంధిత సమస్య కారణంగా తమ సేవలు నిలిచిపోయాయని కంపెనీ తెలిపింది. తాజాగా మరోసారి అలాంటి సమస్య కారణంగానే సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.