33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే పోటీ

imran-khan-to-contest-all-33-parliamentary-seats-in-upcoming-by-polls

లాహోర్‌: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జాతీయ అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల్లో 33 స్థానాల్లో ఆయన ఒక్కరే పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వైస్‌ ఛైర్మన్‌ షా మహ్మద్‌ ఖురేషీ వెల్లడించారు. ముందస్తు ఎన్నికల విషయంలో అధికార పార్టీపై మరింత ఒత్తిడి పెంచేందుకే పీటీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 33 అసెంబ్లీ స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఇప్పటికే పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం ప్రకటించింది.

పంజాబ్‌ ప్రావిన్స్‌లో 12, ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 8, ఇస్లామాబాద్‌లో 3, సింధ్‌లో 9, బలోచిస్థాన్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇలా ఎక్కువ స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది అక్టోబరులో జరిగిన జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ 7 స్థానాల్లో పోటీ చేసి 6 చోట్ల ఆయన విజయం సాధించారు. పాక్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని చోట్ల నుంచి అయినా పోటీ చేయొచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే మాత్రం ఏ స్థానాలను వదులుకుంటారో ఎన్నికల సంఘానికి తెలియజేయాలి.