క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్​లో నిర్వహించిన వేడుకల్లో రమణ పాల్గొని , కేక్‌ కట్‌ చేసి హోటల్ నిర్వాహకులు అందజేశారు. హోటల్‌కు విచ్చేసిన బిషప్‌లు.. క్రిస్మస్ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణతో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం బిషప్‌లకు.. సీజేఐ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపి, కేక్‌ తినిపించారు. ఈ వేడుకల్లో సీజేఐతోపాటుగా.. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి రమణ తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు అత్యంత ఇష్టమైన ఎడ్లబండిపై ఆయనను మేళతాళాల మధ్య ఊరేగించారు. దేశంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పటికీ తన మూలాలు ఈ గ్రామంలోనే ఉన్నాయని.. ఢిల్లీకి రాజైనా.. తాను ఎప్పటికీ పల్లె బిడ్డనే అని అన్నారు. గ్రామస్తులే తనకు తల్లిదండ్రులని, గ్రామాన్ని వదలి ఎంతో కాలమైనా, అత్యున్నత స్థానంలో ఉండి తన స్వగ్రామానికి రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు రాజు, మార్కండేయులును ఆయన గుర్తుచేసుకున్నారు. ఇటువంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులవల్లే తాను దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కాగలిగానన్నారు.