తగ్గేదెలా…చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు బుధువారం పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వేలాది పంటలు దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిని ఆవేదనకు గురవుతున్న రైతులను ఓదార్చేందుకు చంద్రబాబు వెళ్లారు. చిలకలూరిపేట నియోజకవర్గం తూబాడులో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. బాధిత అన్నదాతలను చంద్రబాబు పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించిన ఆయన.. పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతన్నలకు ఓదార్పునిచ్చారు.

ఈ సందర్భంగా పంట పొలాల్లో చంద్రబాబు చేసిన పీట్లు అందర్నీ ఆశ్చర్యంలో పడేశాయి. పొలం గట్లపై బ్యాలెన్స్ ఎంతమాత్రం కోల్పోకుండా సాగిన చంద్రబాబు… కాలవ గట్లపై నుంచి దూకుతూ సాగారు. కాలవ గట్లపై చంద్రబాబు దూకుతూ ఉంటే…ఆయన వెంట సాగిన టీడీపీ నేతలు అలా చూస్తూ ఉండిపోయారు. ఇక సెక్యూరిటీ సిబ్బంది అయితే అలర్ట్ అయిపోయారు. చంద్రబాబుకు ముందు కొందరు, ఆయన వెనుకాల కొందరు నిలబడి.. చంద్రబాబుకు సాయం అందించే యత్నం చేశారు. అయితే ఏ ఒక్కరి సాయం లేకుండా చంద్రబాబు కాలవ గట్లను దాటుతూ సాగిపోయారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 72 ఏళ్ల వయసులో కూడా భద్రతా సిబ్బంది వెన్నంటే ఉన్నా చంద్రబాబు వారి సాయం తీసుకోలేదు. గార్డు చేయి అందించబోతే సున్నితంగా తిరస్కరించి.. తానే స్వయంగా కాలువను దాటారు.