40 ఏళ్ల తర్వాత ఆ ఊరికి వెళ్లిన చంద్రబాబు

Chandrababu in Nagaripalle after 40 years

టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్ల తర్వాత చిత్తూరు జిల్లాలోని నగరిపల్లెకు వెళ్లారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతగా వచ్చిన ఆయన ఇప్పుడు టీడీపీ అధినేతగా గ్రామంలో అడుగుపెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. 40 ఏళ్ల క్రితం కూడా చంద్రబాబు వారింటికే వెళ్లడం జరిగింది. కిశోర్‌కుమార్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి నల్లారి అమర్‌నాథ్‌రెడ్డిని కలుసుకునేందుకు చంద్రబాబు అదే ఇంటికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే ఇంటికి వెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రబాబుకు మహిళలు మంగళ హారతులు పెట్టి స్వాగతం పలికారు.

చిత్తూరు జిల్లాలో న‌ల్లారి కుటుంబానికి బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం ఉంది. చిత్తూరు జిల్లాలో న‌ల్లారి అమ‌ర‌నాథ్‌రెడ్డి సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌. చంద్ర‌బాబు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నారు. 1983లో చంద్ర‌గిరి నుంచి చంద్ర‌బాబు పోటీ చేసి ఓడిన త‌ర్వాత టీడీపీలో చేరారు. చంద్ర‌బాబుతో న‌ల్లారి అమ‌ర‌నాథ్‌రెడ్డి కుమారుడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి రాజ‌కీయ వైరాన్ని కొన‌సాగించారు. న‌ల్లారి అమ‌ర‌నాథ్‌రెడ్డి చిత్తూరు జిల్లా వాయ‌ల్పాడు నుంచి 1962లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిని ఓడించారు. అయితే ఎన్నిక‌ల్లో పోటీకి త‌గిన వ‌య‌సు లేద‌నే కార‌ణంతో అమ‌ర‌నాథ్‌రెడ్డి ఎన్నిక‌ను న్యాయ‌స్థానం ర‌ద్దు చేసింది.

వాయ‌ల్పాడు నుంచి మొత్తం నాలుగుసార్లు అమ‌ర‌నాథ్‌రెడ్డి గెలుపొందారు. మ‌ర్రి చెన్నారెడ్డి, అంజ‌య్య‌, భ‌వ‌నం వెంక‌ట్రామిరెడ్డి కేబినెట్‌లలో ఆయ‌న మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కుమారుడు కిర‌ణ్‌కుమార్ రెడ్డి కొన‌సాగించారు. వాయ‌ల్పాడు నుంచి కిర‌ణ్‌ మూడు సార్లు గెలుపొందారు. 2009లో వాయ‌ల్పాడు నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్ద‌య్యింది. పీలేరుకు కిర‌ణ్ కుమార్ మ‌కాం మార్చారు. 2009లో అక్క‌డి నుంచి గెలుపొంది …వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో కిర‌ణ్ సీఎం అయ్యారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి ముఖ్య‌మంత్రిగా కిర‌ణ్ రికార్డుకెక్కారు.
2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారాయి. కిర‌ణ్ త‌మ్ముడు కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరారు.