ఏపీకి భారీగా నిధులు విడుదల చేసిన కేంద్రం..

ఏపీ ప్రభుత్వానికి మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది కేంద్రం. రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పన కోసం రూ. 948.35 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుతో ఈ నిధులను వెచ్చించనున్నారు.

ఇక బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ, గోదావరి జిల్లాలోని కేపీ పురంలో ఈ పార్కు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు బల్క్ డ్రగ్ పార్క్ కు ఆమోదం తెలుపుతూ కేంద్రం ఏపీకి లేఖ రాసింది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడగా ఏపీకి ఆ అవకాశం దక్కడం విశేషం. ఇక ఈ పార్క్ ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎనిమిదేళ్లలో పార్క్‌ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇలా కేంద్రం నుండి వరుస తీపి కబుర్లు అందడం పట్ల ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తుంది.