వివేక హ‌త్య కేసులో 8 మందిని ప్రశ్నిస్తున్న సీబీఐ

వివేక హత్యకు వాడిన మారణాయుధాల వెలికితీత ప్ర‌క్రియ కొన‌సాగింపు

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచార‌ణ కొన‌సాగిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సునీల్ యాద‌వ్‌ను సీబీఐ అధికారులు ఇటీవ‌ల‌ గోవాలో అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు వివ‌రాలు రాబ‌ట్టిన అధికారులు మ‌రో ఎనిమిది మందిని ఈ రోజున ప్ర‌శ్నిస్తున్నారు.

క‌డప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ కొన‌సాగుతోంది. పులివెందులకు చెందిన శిఖామణి, ఓబులేసు, రఘునాథ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, సంపత్‌, నీలయ్య, శ్రీనివాస్‌రెడ్డి విచార‌ణకు హాజ‌ర‌య్యారు. అంతేకాదు, వివేక హత్యకు వాడిన మారణాయుధాల వెలికితీత ప్ర‌క్రియ‌ ఈ రోజు కూడా కొనసాగుతోంది. సునీల్‌ యాదవ్‌ చెప్పిన అంశాల ఆధారంగా పులివెందులలోని రోటరీపురం వీధి సమీపంలోని ఓ కాలువలో పడేసిన మారణాయుధాలను వెలికి తీస్తున్నారు. పులివెందులలో సీబీఐ అధికారులు వారం రోజుల పాటు ఉండనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/