భార‌త వైమానిక ద‌ళం అమ్ములపొదిలో చేరిన సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్

C-295 aircraft inducted into Air Force, to boost tactical airlift

ల‌క్నో : దేశంలో తొలి సీ-295 మ‌ధ్య‌శ్రేణి ర‌వాణా విమానం హిండ‌న్ ఎయిర్‌బేస్‌లో సోమ‌వారం భార‌త వైమానిక ద‌ళం (ఐఏఎఫ్‌)లో చేరింది. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 20న సీ-295 విమానం గుజ‌రాత్‌లోని వ‌దోద‌ర‌లో ల్యాండ్ అయింది. స్పెయిన్‌లో ఈ విమానాల‌ను వాయుసేన‌కు అప్ప‌గించిన అనంత‌రం కొద్దిరోజుల‌కే ఇవి దేశానికి చేరుకున్నాయి.

ఎయిర్‌బ‌స్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో ఈ విమానాల సేక‌ర‌ణ‌కు రూ. 21,935 కోట్ల ఒప్పందం జ‌రిగిన రెండేండ్ల త‌ర్వాత ఈనెల 13న ఎయ‌ర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌధరి తొలి విడ‌త‌లో 56 సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను రిసీవ్ చేసుకున్నారు. కాలం చెల్లిన అవ్రో-748 విమానాల స్ధానంలో అత్యాధునిక సీ-295 విమానాలు ఐఏఎఫ్ అమ్ములపొదిలో చేరాయి.

కాగా, గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో వ‌దోద‌ర‌లో 295 విమానాల త‌యారీ కేంద్రానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శంకుస్ధాప‌న చేశారు. ప్రైవేట్ క‌న్సార్టియం ఆధ్వర్యంలో భార‌త్‌లో త‌యార‌య్యే తొలి సైనిక విమాన ప్లాంట్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. సీ-295 అత్యాధునిక ర‌వాణా విమానంగా పేరొందింది. ఈ విమానంలో 71 మంది సైనిక ద‌ళాల‌ను, 50 పారాట్రూప‌ర్ల‌ను ఇది చేర‌వేస్తుంది. ప్ర‌స్తుత బ‌రువైన విమానాలు వెళ్ల‌లేని ప్రాంతాల‌కు సైతం సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు యుద్ధ‌సామాగ్రిని, సైనికుల‌ను సుల‌భంగా త‌ర‌లిస్తాయి.