బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న బిత్తిరి సత్తి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బిఆర్ఎస్ , బిజెపి నేతలు పార్టీ కండువాలు కప్పుకోగా..తాజాగా శుక్రవారం మంత్రి హరీష్ రావు సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి (రవి కుమార్ ముదిరాజ్) బిఆర్ఎస్ లో చేరారు.

తెలంగాణ భవన్ లో శుక్రవారం సాయంత్రం టీ పీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి) తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హ‌రీశ్‌రావు వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హైదరాబాద్ న్యూ యార్క్ లెక్క అభివృద్ధి చెందింది అన్నార‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. పక్కన ఉన్న రజీనీలకు అర్థం అవుతున్నది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని కాంగ్రెస్ , బిజెపి నేతలపై విమర్శలు చేసారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని విమర్శించారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా, బలహీనమైన నాయకత్వం ఉండాలా అని ప్రశ్నించారు. ఇటువైపు బలమైన కేసీఆర్ ఉన్నడు, అవతలి వైపు ఎవరు ఉన్నారని నిలదీశారు.