పనితీరు బాగాలేదని ఐదుగురు పోలీసు అధికారులను లాకప్ లో ఉంచిన ఎస్పీ

సాధారణంగా కింద స్థాయి అధికారులు సరిగా పనిచేయకపోతే హెచ్చరించడం ..కొన్ని రోజుల పాటు విధుల నుండి తొలగించడం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ ఎస్పీ మాత్రం తన కింది స్థాయి పోలీసులు అధికారులు సరిగా పనిచేయడం లేదని వారిని రెండు గంటలపాటు లాకప్ లో ఉంచి వార్తల్లో నిలిచారు. ఈ ఘటన బిహార్‌లోని నవాదా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే దీనిపై ఎస్పీని వివరణ కోరగా.. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. ఈ విషయాన్ని సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ వివాదంపై వారు స్పందించలేదు. కాగా ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని బిహార్ పోలీస్ సంఘం డిమాండ్ చేసింది.

అధికారులను ఎస్పీ లాకప్‌లో వేసిన విషయమై బిహార్ పోలీసుల్లో తీవ్రంగా చర్చ నడించింది. ఇలాంటి ఘటనలను ఇంతకు ముందెప్పుడూ తాము చూడలేదు.. ఇలాంటి ఘటనలు బిహార్ పోలీసు విభాగం ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ ఘటనపై న్యాయ విచారణ డిమాండ్ చేస్తున్నాం. అసలేం జరిగిందో సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరపాలి అని అంటున్నారు. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా లో పోలీసులు లాకప్ లో ఉన్న వీడియో వైరల్ గా మారింది.