తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ సంబురాలు

Bathukamma festival in Telangana from today

హైదరాబాద్‌ః తెలంగాణ పండుగ.. పూల సంబురం.. బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ సంబురాలను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు ఘనంగా జరుపుకోనున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చి చుట్టూ చేరి ఆడబిడ్డలంతా పాటలు పాడుతూ గౌరమ్మకు మొక్కుకోనున్నారు. బతుకమ్మ పండుగతో.. ఊరూవాడ పూలవనంగా మారనుంది.

పూలనే పూజించే విశిష్టమైన సంప్రదాయం బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పర్విదనం కేవలం తెలంగాణ సంస్కృతికే సొంతం. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన విషయం తెలిసిందే.

తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి మొదలైన పూలతో.. బతుకమ్మలను అందంగా తయారు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. బతుకమ్మ పేర్చడంలో మహిళలు పోటీలు పడతారు. సాయంత్రం గుడివద్దకో..ఇంటి ముంగిట్లోనో, కూడళ్లలో వద్దకో వెళ్లి.. బతుకమ్మలనంతా ఒక్క చోటకు చేర్చి.. ఉయ్యాల పాటలతో ఆడిపాడుతారు. పల్లెలు.. పట్టణం అన్న తేడా లేకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆరుపదులు దాటిన మహిళలు సైతం చిన్నపిల్లలుగా మారి వేడుకల్లో పాల్గొంటారు.