సెరెనా, ఫెదరర్‌ సునాయాస విజయాలు

serena williams & Roger Federer
serena williams & Roger Federer

మెల్‌బోర్న్‌: సీజన్‌ తొలి టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు భారీ వర్షం అడ్డుగా మారింది. కార్చిచ్చు వల్ల ఏర్పడిన కాలుష్యానికి తోడు వర్షం కూడా తోడవ్వడంతో తొలి రోజు జరగాల్సిన చాలా మ్యాచ్‌లు మంగళవారానికి వాయిదా పడగా.. జరిగిన కొన్ని పోటీల్లో స్టార్‌ ప్లేయర్లు సత్తాచాటారు. అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌, రోజర్ ఫెదరర్‌ సునాయాస విజయాలు అందుకోగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్, యాష్లే బార్టీ మాత్రం శ్రమించారు. మహిళల సింగిల్స్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ వేటలో ఉన్న సెరెనా విలియమ్స్‌ కేవలం 58 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. సెరెనా, అనస్తాసియా పొటపొవా (రష్యా)ను ఓడించింది. రెండో రౌండ్లో సెరెనా.. జిడాన్‌సెక్‌ (స్లోవేనియా)తో తలపడనుంది. తల్లి కాకముందు మూడేళ్ల క్రితం చివరిసారిగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన సెరెనా.. ఈ టోర్నీతో ఎప్పటి నుంచో ఊరిస్తున్న మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డును అందుకోవాలని పట్టుదలగా ఉంది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌), స్టీవ్‌ జాన్సన్‌ (అమెరికా)పై అలవోక విజయం సాధించాడు. రెండో సీడ్ నోవాక్ జొకోవిచ్‌ (సెర్బియా), జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)పై శ్రమించి గెలిచాడు. భారత టాప్‌ ర్యాంక్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ మంగళవారానికి వాయిదా పడింది. జపాన్‌ ప్రత్యర్థి తత్సుమా ఇటోతో సోమవారం జరగాల్సిన ఈ మ్యాచ్‌ వర్షం వల్ల ఈరోకి వాయిదా పడింది. జపాన్‌ ప్లేయర్‌పై గెలిస్తే.. ప్రజ్నేశ్‌కు రెండో రౌండ్లో జొకోవిచ్‌ ఎదురుపడనున్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/