నేడు క‌లుసుకోనున్నసచిన్ పైలట్, సీఎం అశోక్ గెహ్లాట్

రాష్ట్రంలో నెల రోజుల సంక్షోభానికి తెర

Sachin Pilot-Ashok Gehlot

జైపూర్‌: కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేడు ముఖాముఖి కలుసుకోబోతున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గెహ్లాట్ నేతృత్వంలో నేడు కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశం కానుంది. ఈ భేటీకి సచిన్ సహా ఆయన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో దాదాపు నెల రోజుల పాటు కొనసాగిన సంక్షోభానికి మూడు రోజుల క్రితమే తెరపడగా, ఇప్పుడు దానికి కారణమైన ఇరువురు నేతలు ముఖాముఖి కలుసుకోనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిన్న జైసల్మేర్‌లోని రిసార్టులో ఉన్న తన మద్దతు ఎమ్మెల్యేలను కలిసిన ముఖ్యమంత్రి గెహ్లాట్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెల రోజులపాటు సాగిన సంక్షోభం చాలా సహజమైనదని పేర్కొన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అలిగారంటూ రెబల్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జరిగిన పరిణామాలను మర్చిపోయి క్షమించి ముందుకు సాగాలని కోరారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినట్టు ఇక్కడ కూల్చాలని ప్రయత్నించినప్పటికీ బీజేపీ ఏమీ చేయలేకపోయిందని గెహ్లాట్ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/