ఆర్య సమాజ్‌ వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్ధత లేదుః అలహాబాద్ హైకోర్టు

అక్కడ జరిగిన వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలన్న న్యాయమూర్తి

Arya Samaj certificate does not prove marriage says allahabad high court

ప్రయాగ్‌రాజ్‌: ఆర్యసమాజ్‌ ఇచ్చే వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్ధత లేదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహాలను తప్పకుండా రిజస్టర్‌ చేసుకోవాల్సి ఉందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సౌరభ్‌ శ్యాం సమాశ్రయ్‌ ఆదేశాలు ఇచ్చారు. ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నా దాన్ని రిజిస్టర్‌ చేయకపోతే గుర్తించలేమని పేర్కొన్నారు. ఆ సంస్థ ఇచ్చే పత్రాలు వివాహ చట్టబద్ధతను నిరూపించలేవని అన్నారు. ఒక తండ్రి తన కూతురు విషయంలో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారణ చేస్తున్నప్పుడు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘వివిధ ఆర్యసమాజ్ సొసైటీలు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాలతో కోర్టు నిండిపోయింది. ఈ కోర్టు, ఇతర హైకోర్టులలో వివిధ విచారణల సమయంలో వాటి చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నించారు. ఇలాంటి పత్రాల వాస్తవికతను కూడా పరిగణనలోకి తీసుకోకుండా వివాహాలను నిర్వహించడంలో ఆర్య సమాజ్ సంస్థ నమ్మకాలను దుర్వినియోగం చేసింది. ప్రస్తుత కేసులో, తాము చట్టబద్ధంగా వివాహం చేసుకున్నామని నిరూపించడానికి రెండో పిటిషనర్ తన భార్య అని చెబుతూ భోలా సింగ్ అనే వ్యక్తి హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కానీ, పిటిషనర్ల తరఫు న్యాయవాది ఘజియాబాద్ఆర్య సమాజ్ జారీ చేసిన సర్టిఫికేట్‌పై ఆధారపడ్డారు. వారి వివాహం రిజిస్టర్ కానందున పైన పేర్కొన్న సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే పార్టీలు వివాహం చేసుకున్నట్లు భావించలేము’ అని స్పష్టం చేశారు.

తాజ సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/