హైదరాబాద్ లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి అన్ని ఏర్పట్లు పూర్తి

హైదరాబాద్ లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి అన్ని ఏర్పట్లు పూర్తి

వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జన ఏర్పట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. నిమ‌జ్జ‌న విధుల్లో పాల్గొనే అధికారుల‌తో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ శనివారం స‌మీక్ష చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిమ‌జ్జ‌నానికి ట్యాంక్ బండ్ వ‌ద్ద 40 క్రేన్ల‌ను అందుబాటులో ఉంచామని, వీటితో పాటు మ‌రో నాలుగు క్రేన్ల‌ను అద‌నంగా ఉంచామని ఆయన తెలిపారు. నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో భాగంగా 19 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు. గణేశ్ నిమజ్జనం కోసం ఆయా జిల్లాల నుంచి 7 వేల మంది పోలీసుల‌ను ర‌ప్పించామని, నిమ‌జ్జ‌న విధుల్లో 8,700 మంది శానిటేష‌న్ సిబ్బంది ఉంటారని మంత్రి చెప్పారు. ఆదివారం 40 వేల విగ్ర‌హాలు నిమ‌జ్జ‌నం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు.

క్రేన్ నంబ‌ర్ 5 వ‌ద్ద ఖైర‌తాబాద్ గ‌ణేశుడి నిమ‌జ్జ‌నం జరుగుతుందని, వీలైనంత త్వ‌ర‌గా నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి తలసాని స్పష్టం చేశారు. నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌లో పాల్గొనే వారికి మాస్కులు పంపిణీ చేస్తామ‌ని ఆయన చెప్పారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ ఆంక్షల గురించి తెలుసుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు. అలాగే గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో 565 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు 31 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు, ప్రతి డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది.