సారా వ్యాపారం తెలిసిన వ్యక్తికి.. విద్యా శాఖనా..? అంటూ చంద్రబాబు ఎద్దేవా

టీడీపీ అధినేత చంద్రబాబు..ప్రస్తుతం జిల్లా యాత్ర మొదలుపెట్టి ప్రభుత్వం వైఫల్యాలు ప్రజలకు తెలియజేస్తూ..ప్రజల కష్టాలను అడిగితెలుసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఇష్టారాజ్యంగా పన్నులు పెంచేసిన ముఖ్యమంత్రిపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. రోడ్డుపైన గుంతలనే పూడ్చలేని ముఖ్యమంత్రి.. ఇంక అభివృద్ధి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను వైస్సార్సీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

మంత్రి బొత్స సత్యనారాయణకు సారా వ్యాపారం మాత్రమే తెలుసునని.. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని.. రాష్ట్రం కోసం మాత్రమే తన బాధంతా అని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయతీపరుడైన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజును వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి పేదలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ సీఎంగా ఉన్నంతకాలం ఎవరికీ ఉద్యోగాలు, పెట్టుబడులు రావని.. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రా.. నినాదంతోనే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు అన్నారు.