కార్యాలయాల తరలింపుపై ఏపి హైకోర్టు ఆగ్రహం
అప్పటి వరకూ తరలించొద్దంటూ ఆదేశం

అమరావతి: ఏపి రాజధాని అమరావతి నుంచి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమరావతి ప్రాంత రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని ఈ ఉదయం విచారించిన హైకోర్టు… ఏపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాజధాని అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్న తరుణంలో కార్యాలయాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. ఫిబ్రవరి 26 వరకు కార్యాలయాలను తరలించొద్దంటూ తాము ఆదేశాలను జారీ చేసినప్పటికీ ఎందుకు తరలిస్తున్నారని నిలదీసింది. ఈ సందర్భంగా ఏజీ స్పందిస్తూ అమరావతిలో కార్యాలయాల నిర్వహణ సరిగా లేదని, కార్యాలయాల తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, స్థానికంగా ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలను చేపట్టవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ తో మరో రెండు పిటిషన్లను కలిపి మధ్యాహ్నం మరోసారి విచారణ చేపడతమని చెప్పారు. ఇరు వైపుల వాదనలను విన్న తర్వాత హైకోర్టు తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/