ఇవాళ రాత్రికి దావోస్‌ కు చేరుకోనున్న సీఎం జగన్

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్ కు హాజరు కానున్న ముఖ్యమంత్రి బృందం

ap cm YS Jaganmohan Reddy visits Davos
AP CM YS Jagan Mohan Reddy visits Davos with wife Bharathi

Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం తాడేప‌ల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు స్వాగ‌తం ప‌లికారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో దావోస్‌కు బ‌య‌ల్దేరారు.శుక్రవారం రాత్రికి దావోస్ చేరుకోనున్నారు. సీఎం వెంట మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, గుడివాడ అమ‌ర్‌రాథ్‌, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.

22వ తేదీ నుంచి 26 వ‌ర‌కు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్

ఈనెల 22వ తేదీ నుంచి 26 వ‌ర‌కు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్ జ‌ర‌గ‌నుంది. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్‌ కేంద్రంగా జరిగే వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం సమ్మిట్‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌, మంత్రులు, అధికారుల బృందంతో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు.
పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్‌ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి.

విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా నాలుగో పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు.
బెంగళూరు-హైదరాబాద్‌, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు.

కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సాధించిన ప్రగతిని దావోస్‌ వేదికగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు చేసే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామం కానుంది. కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో సీఎం బృందం వివరించనుంది.

సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్‌ కనెక్టివిటీ, రియల్‌ టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది.

దావోస్‌ సదస్సులో వివరించే అంశాలతో ఏపీ పెవిలియన్‌ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీపుల్‌-ప్రోగ్రెస్‌-పాజిబిలిటీస్‌ నినాదంతో ఈ పెవిలియన్‌ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ సమ్మిట్‌ గత డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. కరోనా కేసులు పెరగడంతో సమ్మిట్‌ను వాయిదా వేయటం జరిగింది.

‘తెర ‘ (సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/