ఏపీ టెన్త్ ఫలితాల్లో ఎక్కువ మంది సోషల్ లోనే ఫెయిల్ అయ్యారట..కారణం అదే అంటున్నారు

ఏపీలో తాజాగా టెన్త్ ఫలితాలు వచ్చాయి. గతంలో కంటే చాల తక్కువ స్థాయిలో ఉత్తీర్ణులయ్యారు. ఫెయిల్ అయినా విద్యార్థులు ఎక్కువగా సోషల్ సబ్జెక్టులోనే తప్పడంతో ఇప్పుడు చర్చ గా మారింది. హిందీ, ఇంగ్లిష్ వంటి కఠిన సబ్జెక్టుల్లోనూ పాస్ అయిన విద్యార్థులు.. సోషల్‌లో తప్పడానికి కారణం బిట్ పేపర్‌ను కుదించడమేనని చెబుతున్నారు. గతంలో బిట్ పేపర్ 30 మార్కులకు ఉండగా, ఈసారి దానిని 12 మార్కులకు తగ్గించారు. అందుకే మార్కులు తగ్గి ఫెయిల్ అయ్యారని అంటున్నారు. సోషల్ తర్వాత ఎక్కువమంది ఫెయిలైన సబ్జెక్టుల్లో మ్యాథ్స్, సైన్స్ కూడా ఉన్నాయి. లాంగ్వేజెస్‌లో మాత్రం ఎక్కువ మంది విద్యార్థులు పాసయ్యారు. ఇక, ఇంగ్లిష్ సబ్జెక్టులో పాసైన వారిలో ఎక్కువమంది ప్రైవేటు స్కూళ్లకు చెందినవారు ఉండడం గమనార్హం. హిందీ పరీక్షలో 20 మార్కులకే పాస్ కాబట్టి ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత శాతం బాగానే ఉంది. ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే తమ విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తల్లి దండ్రులు వాపోతున్నారు.

మరోపక్క ఈ ఫలితాల ఫై టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు.. స‌ర్కారు ఫెయిల్యూర్ అని మండిపడింది. అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకి విద్యార్థుల్ని త‌గ్గించే కుట్ర అంటూ నారా లోకేష్ అగ్రహం వ్యక్తం చేశారు. టెన్త్ ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితోపాటు ఇంట‌ర్‌, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని కుట్ర‌తోనే ఎక్కువ‌ మందిని ఫెయిల్ చేశార‌ని ఆయన ధ్వజమెత్తారు. తొలిసారి నిర్వ‌హించిన టెన్త్ ప‌రీక్ష‌లు పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, మాల్ ప్రాక్టీసుల‌తో అభాసుపాలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. టెన్త్ రిజ‌ల్ట్స్‌ వాయిదా, దిగ‌జారిన ఫ‌లితాలన్నీ స‌ర్కారు కుతంత్ర‌మేనని, నాడు నేడు పేరుతో రూ. 3500 కోట్లు మింగేసి విద్యావ్య‌వ‌స్థను నిర్వీర్యం చేశారని ఆయన దుయ్యబట్టారు. టీచ‌ర్ల‌కి త‌న వైన్‌షాపుల వ‌ద్ద డ్యూటీ వేసే శ్ర‌ద్ధ విద్య‌పై సీఎం ఎప్పుడూ దృష్టి పెట్టలేదంటూ లోకేష్ విమర్శించారు.

‘నాడు-నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఆర్భాటపు ప్రచారానికి, నిన్న వచ్చిన పదో తరగతి ఫలితాలకి పొంతనే లేదు. టిడిపి హయాంలో 90-95 శాతం ఉన్న ఉత్తీర్ణత… ఇప్పుడు 67 శాతానికి పడిపోవడం రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనం’ అని చంద్రబాబు ఆరోపించారు.

‘రెండు లక్షలమందికి పైగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక్కడ ఫెయిల్ అయ్యింది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప విద్యార్థులు కాదు అని అంతా గుర్తించాలి. పరీక్షల్లో తప్పామని విద్యార్థులు ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలి. వ్యవస్థలో లోపాలకు మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.