మణిపూర్‌లో మరో దారుణ సంఘటన

వ్యక్తి తల నరికి వేలాడదీసిన వీడియో క్లిప్‌ వైరల్‌

Another Manipur shocker, video of chopped head emerges

ఇంఫాల్‌: హింసాత్మక సంఘటనలు, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. జూలై 2న బిష్ణుపూర్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు చంపారు. డేవిడ్ థీక్ అనే కుకీ వ్యక్తి తల నరికారు. ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. ఈ వీడియో క్లిప్‌ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

కాగా, ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి వారిని నగ్నంగా ఊరేగించిన వీడియో క్లిప్‌ ఈ నెల 19న సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మే 4న జరిగిన ఈ అమానుష సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా పార్లమెంట్‌ ఉభయ సభలను కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ తరుణంలో కుకీ వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ వైరల్‌ కావడం మణిపూర్‌లో మరింతగా ఉద్రిక్తతలను రాజేస్తున్నది.